విశాఖలో రూ.70 వేల కోట్లతో డేటా పార్క్
ఆంధ్రప్రదేశ్‌లో డేటా పార్క్, సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, అదానీ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీల సమక్షంలోనే ఇందుకు బీజం పడింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రజావేదిక వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్, అదానీ గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒప్పందంలో భాగంగా విశాఖ నగరంలో పర్యావరణ హిత డేటా పార్క్‌ను అదానీ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. రాబోయే 20 ఏళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనకు వీలుగా రూ.70వేల పెట్టుబడులు పెడుతుంది.
విశాఖపట్నంలో 500 ఎకరాల్లో ఒక గిగా వాట్ డేటా సెంటర్ (మూడు కేంద్రాలు) ఏర్పాటు చేస్తుంది. 5 గిగా వాట్స్ సోలార్ పార్క్‌ను కూడా నెలకొల్పుతుంది. ఈ డేటా కేంద్రాన్ని ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌తో అనుసంధానించడం ద్వారా మెగురైన ఇంటర్నేట్ సేవలు అందించే కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్ వేర్ సప్లయర్స్, సాఫ్ట్వేర్, స్టార్టప్ కంపెనీలు, టెలీకాం కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు రాష్ట్రానికి వచ్చే అవకావం ఉందని ఐటీ శాఖ భావిస్తోంది.













