విద్యార్థుల కోసం బైజూస్ సంస్థతో ఒప్పందం : వైఎస్ జగన్
విద్యార్థుల కోసం బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకుని యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జగన్న విద్యా కానుక కిట్లను సీఎం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అవసరమని అన్నారు. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని తెలిపారు. నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న సుమారు 47 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు శుభదినమని అన్నారు. రూ.931 కోట్లతో విద్యాకానుక కిట్లు అందజేస్తున్నట్లు జగన్ తెలిపారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చామని తెలిపారు. 8వ తరగతి పిల్లలకు రూ.12 వేల విలువైన ట్యాబ్ ఇస్తున్నామన్నారు. బైజూస్ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామన్నారు. కార్యక్రమం అనంతరం అన్ని పాఠశాలలకు సంబంధించిన 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు.













