వామ్మో.. ఒక్కరోజు అన్న క్యాంటీన్‌కి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?
2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల మధ్యకు తీసుకు వచ్చిన పథకం అన్న క్యాంటీన్. నాణ్యమైన భోజనాన్ని పేదవాడికి అతి తక్కువ ధరకి అందివ్వడమే ఈ స్కీం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక దీనివల్ల లబ్ధి పొందే వారు రోజువారి కూలీలు, కార్మికులు కావడంతో దీనికి మంచి ఆదరణ లభించింది. 2019 ఎన్నికల విజయం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ అన్న క్యాంటీన్లను మూసివేసింది. అనంతరం తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం తిరిగి అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే అన్న క్యాంటీన్ల బడ్జెట్ ఎంత అనే విషయం మనలో చాలామందికి తెలియదు. చూడడానికి ఇది చిన్న ప్రాజెక్టు అనుకుంటున్నారేమో కానీ మన రాష్ట్ర బడ్జెట్ పై ఇది చాలా పెద్ద భారాన్నే మోపుతుంది.
అన్న క్యాంటీన్లకు హరే రామ ట్రస్ట్ సబ్సిడీపై భోజనాన్ని సరఫరా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పథకం కారణంగా ప్రభుత్వంపై రోజుకి ఎంత భారం పడుతుందో ఓసారి తెలుసుకుందాం.. తాజా అంచనాల ప్రకారం 100 అన్న క్యాంటీన్లకు రోజువారి ఖర్చు సుమారు 78.75 లక్షలు. అంటే నెలకు వీటి ఖర్చు సుమారు 20 కోట్లు.. అంటే ఒక సంవత్సరానికి 100 అన్న క్యాంటీన్ల ఖర్చు 236 కోట్ల వరకు అవుతుంది.
ఇది కేవలం 100 క్యాంటీన్ల ఎస్టిమేషన్ మాత్రమే.. వచ్చే నెలలో ఉన్న 100 క్యాంటీన్లతో పాటు మరో 103 క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చు మరింత పెరుగుతుంది. మొత్తం 203 అన్న క్యాంటీన్లకు కలిపి రోజువారి ఖర్చు సుమారు ఒకటిన్నర కోటి అవుతుందని అంచనా. అంటే నెలకు 45 కోట్లు ఏడాదికి 479 కోట్ల వరకు ఈ పథకం కారణంగా ఖర్చవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి రీత్యా ఈ పథకం ఎంతవరకు కొనసాగుతుంది అన్న విషయంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అయిదు సంవత్సరాల పాటు దీన్ని బలవంతంగా కొనసాగించినప్పటికీ.. ప్రభుత్వ బడ్జెట్ పై ఇది భారీ ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది.













