రాష్ట్రమంతటా ఆరోగ్యశ్రీ- జగన్
ఆంధప్రదేశ్ రాష్ట్రమంతటా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్నామని, ఆస్తులు అమ్ముకునే అవసరం లేకుండా నిరుపేదలు, నిస్సహాయులకు తన ఖర్చుతో ప్రభుత్వమే వైద్యం చేయించే పథకమే ఆరోగ్యశ్రీ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైద్యం బిల్లు వెయ్యి రూపాయలు దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింప చేసే పక్రియను రాష్ట్రంలోని మిగిలిన ఆరు జిల్లాలైన శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురంలకు విస్తరించే కార్యక్రమాన్ని ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. దీంతో పాటు కొత్తగా ఆరోగ్యశ్రీలో చేర్చిన 234 చికిత్సలను కలిపి మొత్తం 2,434 వైద్య చికిత్సలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింప చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని కలెక్టర్లు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ లబ్ధిదారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ పథకం అమలు దిశలో అడుగులు వేశామన్నారు. ఈ 17 నెలల్లో, కోవిడ్ కష్టకాలంలోనూ ఆర్థికంగా కనీవినీ ఎరుగని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ వైద్య ఆరోగ్య రంగం మీద మమకారంతో ఎన్ని అడుగులు వేశామో అందరికీ తెలుసని చెప్పారు.
రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చామని, వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి వర్తింపచేయడంతో దాదాపు 95 శాతం కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తోందన్నారు. హెల్త్ రికార్డులతో అనుసంధానం అయిన క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులు జారీ చేసినట్లు జగన్ తెలిపారు.
ఈ ఏడాది జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో 2,059 చికిత్సలతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించామని, అదే సమయంలో మిగిలిన జిల్లాల్లో 1,313 రకాల చికిత్సలను పథకంలోకి తీసుకువచ్చామన్నారు. గతంలో కేవలం 1,059 చికిత్సలు మాత్రమే ఉండేవి. మన ప్రభుత్వం వచ్చాక ఏకంగా రూ.680 కోట్లు ఆరోగ్యశ్రీ తరఫున నెట్వర్క్ హాస్పిటల్స్ కు బకాయిలు చెల్లించడంతోపాటు, ఆరోగ్యశ్రీ పరిధి విస్తరిస్తూ, ఈ ఏడాది జూన్ 16న కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు విస్తరించినట్లు తెలిపారు. ఇప్పుడు మిగతా జిల్లాల్లోనూ దీనిని వర్తింప చేసినట్లు, కోవిడ్, పోస్ట్ కోవిడ్ చికిత్సను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.













