ఏపీలో చేపల వేటపై రెండు నెలల నిషేధం విధించిన ప్రభుత్వం
ఏపీలో రెండు నెలలపాటు చేపల వేటపై నిషేధం విధించారు. సాధారణంగా ప్రతి ఏడూ చేపల ప్రత్యుత్పత్తి, గుడ్లు పెట్టే సమయంలో సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు ఎవరూ వెళ్లకుండా నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు. ఈ నిషేధం మెకనైజ్డ్ (యాంత్రిక), మోటార్ బోట్లకు వర్తిస్తుందని వెల్లడించారు..
ఏటా వేసవి కాలంలో వివిధ రకాల చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి చేస్తాయని తెలిపిన కన్నబాబు.. అందుకే తల్లి చేపలు, రొయ్యలు మత్స్యకారుల వలలకు చిక్కుకూడదనే ఈ నిషేధం విధించినట్లు వివరించారు. ఒకవేళ ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని, అలా చేసిన వారు చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని కన్నబాబు స్పష్టం చేశారు. బోట్లను, వారు పట్టిన చేపలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతోపాటు వారిపై జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. అలాగే ఇలా ఆజ్ఞలు ఉల్లంఘించిన మత్స్యకారులకు ప్రభుత్వం అందించే రాయితీలు, సదుపాయాలు అన్నింటినీ నిలిపివేస్తామని తేల్చిచెప్పారు.













