జలవనరుల నిర్వహణలో ఏపీకి కేంద్ర అవార్డు
దేశంలో సమర్ధవంతంగా జల వనరులను వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. జల వనరుల నిర్వహణలో దేశంలో మూడో ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీటి నిర్వహణ, సంరక్షణలో రాష్ట్రంలోని చాగలమర్రి కస్తూర్బా పాఠశాలకు రెండో బహుమతి దక్కింది. ఢిల్లీలో శనివారం నాడు నాలుగో జాతీయ నీటి అవార్డుల ప్రదానోత్సవం వేడుకలు జరిగాయి. ఈ అవార్డులను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కఢ్ చేతుల మీదుగా విజేతలు అందుకున్నారు. ఏపీ తరపున జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ ఈ అవార్డులను తీసుకున్నారు.. ఇక జల వనరుల నిర్వహణలో ఉత్తమ రాష్ట్రంగా మొదటి బహుమతి మధ్యప్రదేశ్ అందుకుంది. ఉత్తమ జిల్లాల్లో తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాకు మూడవ అవార్డ్ దక్కింది. గ్రామపంచాయతీ కేటగిరీలో దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామానికి బహుమతి అందింది. యూనివర్సిటీల కేటిగిరిలో హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి రెండో అవార్డ్ దక్కగా..ఉత్తమ పరిశ్రమగా తిరుపతిలోని సీసీఐ ఇండియా లిమిటెడ్ మూడో బహుమతి అందుకుంది. ఇక స్వచ్ఛంద సంస్థల విభాగంలో అనంతపురం ఏషియన్ ప్రాటేర్నాకు ప్రత్యేక అవార్డ్ దక్కింది.













