7 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల 7వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. 7వ తేదీ మంత్రిమండలి సమావేశం అనంతరం ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో బడ్జెట్‌తో పాటు పలు కీలక బిల్లు పెట్టే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పరిపాలనా వికేంద్రీకణ బిల్లును ఉపసంహరించుకున్న నేపథ్యంలో మరో రూపంలో కొత్త బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల బిల్లు కూడా రానుంది. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లపై ఒక బిల్లును తీసుకురానున్నారు. ప్రభుత్వం స్థలం కేటాయించిన తరువాత అందులోనే అనుభవదారు 20 ఏళ్లు పైబడి ఉంటే రిజిస్ట్రేషన్ చేసే విధంగా బిల్లును తీసుకురానున్నారు. వన్‌టైం రిజిస్ట్రేషన్ బిల్లునూ పెట్టనున్నారు. మండలిలోనూ అధికార పక్షం బలం పెరగడంతో ఈ సారి పెట్టే బిల్లులన్నీ ఆమోదం పొందనున్నాయి.













