మృతుల కుటుంబాలకు కోటి పరిహారం : వైఎస్ జగన్
ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ సంఘటన దురదృష్టకరమని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని ఆయన పరామర్శించారు. అనంతరం ఆంధ్రా మెడికల్ కాలేజీలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెల్లవారు జామున గ్యాస్ లీకైంది. చుట్టుపక్కల గ్రామాలపై ప్రభావం చూపింది. గ్యాస్ ప్రభావం ఐదు గ్రామాలపై ఉంది. ఘటనపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో కమిటీ సూచించింది అని తెలిపారు.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. జరిగిన దుర్ఘటనలో చనిపోయిన మనుషులకు వెనక్కి తీసుకురాలేకపోయినా, మనసున్న మనిషిగా బాధితుల కుటుంబాలకు అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటీ చొప్పున ఆర్థికసాయం అందచేస్తాం. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారందరికి రూ.10 లక్షల పరిహారం అందిస్తామన్నారు. బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, జంతు నష్టం జరిగిన వారిని ఆదుకుంటాం. ఒక్కో జంతువుకు రూ.25 వేల నష్టపరిహారం చొప్పున సాయం చేస్తామని చెప్పారు. ఎల్జీ కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.













