తెలంగాణ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు ఆంధ్రాలో పాలాభిషేకాలు
తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ చిత్రపటానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు ప్రజలు పాలాభిషేకాలు చేశారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలందరమూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించారు. పాలాభిషేకం సందర్భంగా తెలుగు వారి ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును వందశాతం అమ్మేసే ప్రయత్నంలో కేంద్రం ఉందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తామని ప్రకటించారు. ఎలాగైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి పేర్కొన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతి తీసుకొని, వైజాగ్ వచ్చి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామని కేటీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ప్రజలు మంత్రి కేటీఆర్ ఫొటోలకు పాలాభిషేకం చేశారు.













