ఆ యాప్‌లతో జాగ్రత్త … ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు : హోంమంత్రి అనిత
4 నెలల్లోనే దేశవ్యాప్తంగా రూ.1730 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాకథాన్ నిర్వహించారు. 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన, ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ దేశంలో 24 శాతం వరకు సైబర్ నేరాలు పెరిగాయని పేర్కొన్నారు. నిత్య జీవితంలో వినియోగించే అనేక యాప్‌ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. అనేక సామాజిక మాధ్యమాలు, యాప్‌లకు పౌరులు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతోందన్నారు. లోన్‌యాప్‌లు, హనీట్రాప్, ఇతర యాప్‌ల ఊబిలో పడి పలువురు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ నేరాల నియంత్రణకు రాష్ట్రస్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు.













