Sanjay IPS: ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌కు రిమాండ్.. ఏపీలో సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో పనిచేసిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదు కావడం, జైలుకు వెళ్లడం సంచలనం కలిగిస్తోంది. తాజాగా ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ (N Sanjay) అవినీతి ఆరోపణలతో జైలుపాలయ్యారు. ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ (DG)గా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. హైకోర్టు తీర్పుతో ముందస్తు బెయిల్ పొందిన ఆయన, సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టులో లొంగిపోయారు. దీంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
ఎన్. సంజయ్ 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. వై.ఎస్. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయనకు కీలక పదవులు లభించాయి. ముందు ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ సమయంలో ఆన్‌లైన్ నాక్షనల్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (NOC) జారీ కోసం ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. తర్వాత, సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన సుమారు రూ. 1 కోటి నిధులను అవేర్‌నెస్ కార్యక్రమాలకు కేటాయించారు. ఇవన్నీ దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలున్నాయి.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్ అవినీతి ఆరోపణలపై కేసు పెట్టింది. ఫైర్ సర్వీసెస్‌లో ల్యాప్‌టాప్‌ల ప్రొక్యూర్‌మెంట్‌లో అక్రమాలు, సీఐడీలో నిధుల చేతివాటం జరిగిందనే ఆరోపించింది. దీంతో సంజయ్ పై చంద్రబాబు ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. కేసులో అరెస్టు తప్పదనే భయంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను హైకోర్టు అంగీకరించి, బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్‌ను రద్దు చేసింది. సంజయ్‌ను నాలుగు వారాల్లోగా ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సంజయ్ అరెస్టు తప్పదని భావించారు. వెంటనే విజయవాడ ఏసీబీ కోర్టు ముందు సరెండర్ అయ్యారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 9 వరకూ ఆయన రిమాండ్ లో ఉంటారు. ఏసీబీ అధికారులు సంజయ్‌ను కస్టడీలోకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాలు కౌంటర్లు వేయాలని కోర్టు ఆదేశించింది. అడిషనల్ డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి జైలుకు వెళ్లడం చాలా అరుదైన సంఘటన. గతంలో కొంతమంది సీనియర్ అధికారులు అవినీతి కేసుల్లో బెయిల్‌పై బయటపడ్డారు. కానీ రిమాండ్‌కు గురవడం అసాధారణం. జగన్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు కూడా ఇటీవల జైలుకు వెళ్లారు. ఇప్పుడు సంజయ్ కూడా రిమాండ్ కు గురయ్యారు.