అవయవదానానికి ముందుకొచ్చిన సీఎం చంద్రబాబు
అవయవ దానం చేసేందుకు తాను సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతి ప్రజావేదిక హాల్లో నిర్వహించిన అవయవదాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అవయవ దానాన్ని పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో అవయవదానం ఒక షరతుగా పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా లక్షా ఇరవై వేల మంది అవయవ దాతలు ముందుకు వచ్చారు. వారికి ఇచ్చిన పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో జీవన్‌దాన్ సంస్థకు మెప్మా అందజేసే కార్యక్రమం ప్రజావేదిక వద్ద నిర్వహించారు. ఢిల్లీకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ వర్మ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఈ చారిత్రక ఘట్టాన్ని నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. తన పిలుపునకు స్పందించి ఇంతమంది ముందుకు రావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.













