కాకినాడ సమీపంలో జీఎంఆర్ ఓడరేవుకు శంకుస్థాపన
ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ జీఎంఆర్..తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు సమీపంలోని కోన గ్రామంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఓడరేవుకు ఇటీవల భూమిపూజ చేసింది. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టులో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జీఎంఆర్ కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్‌తో నిర్వహిస్తున్న ఈ బ హత్ ప్రాజెక్టులో రిఫైనరీ, పెట్రో కెమికల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి హల్దియా పెట్రో కెమికల్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. రూ.60 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ రిఫైనరీ/పెట్రో కెమికల్ ప్రాజెక్ట్‌తో భవిష్యత్తులో 5 లక్షల మందికి ఉపాధి దొరుకనున్నది. డీబీఎఫ్‌వోటీ పద్దతిన ఏర్పాటు చేస్తున్న ఈ రేవుపై గతేడాది నవంబర్ 21న ఆ రాష్ట్ర ప్రభుత్వంతో జీఎంఆర్ ఒక అంగీకారానికి వచ్చింది.
ఈ ఒప్పందంలో భాగంగా రేవుకు వచ్చిన మొత్తం ఆదాయంలో 30 ఏండ్లపాటు కన్షీషన్ ఫీజు కింద 2.7 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, 31-40 ఏండ్ల వరకు 5.4 శాతం, 41-50 ఏండ్ల వరకు 10.8 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 1,811 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ రేవులో 133 ఎకరాలు సముద్రంలోనే నిర్మించింది. బొగ్గు, సాధారణ, లిక్విడ్‌కు సంబంధించిన సరుకులు రవాణా కానున్నాయి. వైజాగ్-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్‌కు దగ్గర్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఓడరేవు భవిష్యత్తులో భారత్‌కు గేట్‌వే ఆఫ్ ఈస్ట్ కోస్ట్‌గా మారనున్నది.













