మరో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ది కొసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో పారదర్శకత కోసం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాల అమలు, పాలనలో ఎలాంటి విధానాలు అవలంభించాలో దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రజావేదికలో ఐపీఎస్ అధికారులతో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గిరిజనుల జీవనానికి ఆటంకంగా మారుతున్న బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవోను రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. గిరిజనలు వద్దన్నప్పుడు తవ్వకాలు చేయడంలో అర్థం లేదన్నారు. బాక్సైట్ మైనింగ్ జరగకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి శాంతి, ప్రశాంతత ముఖ్యం అని గుర్తించుకోవాలని అధికారులకు సూచించారు. గిరిజనులు మావోయిస్టులుగా మారకుండా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గిరిజనుల జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.













