పరిపాలించే అర్హత ఏమాత్రం లేని ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ: చంద్రబాబు
ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోదీకి, పరిపాలించే అర్హత ఎంతమాత్రమూ లేదు. చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రంపై కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇది దుర్మార్గం – నీచం – మంచి పద్ధతి కాదు. గతంలో ఏపీ భవన్ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు చేశాం. అవన్నీ విజయవంతం అయ్యాయి. ఇప్పుడు న్యాయమైన డిమాండ్లతో చేస్తున్న ఈ దీక్ష కూడా విజయవంతం అవుతుంది.
మోదీ అడుగుతున్నట్టుగా లెక్కలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే లెక్కలు మోదీ కూడా చెప్పాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉంది. పరిపాలించే వ్యక్తులు… ప్రజల మనోభావాలను గుర్తు పెట్టుకుని, పరిపాలిస్తే, దేశ సమగ్రతకు భంగం కలగకుండా ఉండే పరిస్థితి వస్తుంది. మేము ఢిల్లీలో ఉన్నాం. మాకు అధికారం ఇచ్చారు. మెజారిటీ ఉంది. మా ఇష్ట ప్రకారం మేము చేస్తామంటే… మీ ఆటలు సాగవని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పరిపాలించే వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. బాధ్యత విస్మరించి, ఇష్టానుసారం చేస్తామని, అధికారం నెత్తికెక్కినప్పుడు… మళ్లీ ఆ నెత్తికెక్కిన అధికారాన్ని దించే అధికారం ఈ ప్రజలకు ఉందని గుర్తు పెట్టుకోవాలి.
మనం పోరాడేది మన కోసం కాదు… ఐదు కోట్ల మంది ప్రజల కోసం పోరాడుతున్నాం. భావి తరాల కోసం పోరాడుతున్నాం. ఆత్మాభిమానం కోసం పోరాడుతున్నాం. జీవితంలో ఆస్తులు పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించుకోవచ్చుగానీ, ఆత్మగౌరవాన్ని పొగొట్టుకుని బతకలేమని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఈ ఢిల్లీలో న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందుకు అందరి సహకారం తీసుకుంటాం. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అహంభావాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్నించినందుకు నిందలు వేస్తున్న వ్యక్తులకు గుణపాఠం చెప్పే సమయం తొందర్లోనే ఉంది. తెలుగువారి సత్తా, ప్రజల నాడి తెలియని వ్యక్తి నరేంద్ర మోదీ : దిల్లీ ధర్మపోరాట దీక్షలో సీఎం చంద్రబాబునాయుడు.













