CID : కాకినాడ పోర్ట్ కేసులో సీఐడీ దూకుడు..! అరెస్టులు ఖాయమా..!?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కాకినాడ సీపోర్ట్ (Kakinada Sea Ports) వార్తల్లో నిలుస్తోంది. ఈ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని (Ration Rice ) అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారనే వార్తలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోర్టుకు వెళ్లి సీజ్ ది షిప్ అని చెప్పడంతో ఇది మరోసారి సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఈ పోర్టులో బియ్యంపై విచారణ జరుగుతోంది. బాధ్యతలపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంతలోనే ఈ పోర్టును తన నుంచి బలవంతంగా బెదిరించి లాక్కున్నారంటూ గత ప్రభుత్వ పెద్దలపై ఓనర్ కేవీ రావు (KV Rao) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో నిజాలు నిగ్గుతేల్చేందుకు సీఐడీ రంగంలోకి దిగింది.
కాకినాడ సీపోర్టుతో పాటు కాకినాడ్ సెజ్ (Kakinada SEZ) లో తన వాటాలను భయపెట్టి, బెదిరించి అరబిందో రియాలిటీ (Aurobindo Realty) పేరిట రాయించుకున్నారంటూ సీపోర్ట్స్ ఎండీ కర్నాటి వెంకటేశ్వర రావు సీఐడీకి (CID) ఫిర్యాదు చేశారు. విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) ఫోన్ చేసి వైవీ సుబ్బారెడ్డి ( YV Subba Reddy) తనయుడు విక్రాంత్ రెడ్డిని (Vikranth Reddy) కలవాలని సూచించడం.. కలిసినప్పుడు అక్కడ అరబిందో ఓనర్ శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy) ఉండడం.. ఆడిటింగ్ వివరాలు బయటపెట్టి వాటాలు బదిలీ చేయాలని కోరడం.. దాదాపు 3వేల కోట్ల రూపాయల విలువైన వాటాలను కేవలం 6 వందల కోట్ల రూపాయలకే బదిలీ చేయించుకోవడం.. లాంటి అంశాలను కేవీ రావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈయన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ ఇప్పుడు విచారణ మొదలు పెట్టింది.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టు బదిలీ వెనుక ఏదో జరుగుతోందనే ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి కేవీ రావు నోరు మెదిపే పరిస్థితి లేదు. బయట చెప్తే ఏం జరుగుతుందో అప్పటికే వాళ్లు హెచ్చరించినట్లు కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తనకు గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, న్యాయం చేయాలని కోరారు. అయితే కేవీ రావు చెప్పేవన్నీ అవాస్తవాలని.. ఆయన చంద్రబాబు మనిషి అని వైసీపీ (YSRCP) ఆరోపిస్తోంది. 6 వందల కోట్లకు తన వాటాలను ఆయనే స్వచ్ఛంధంగా అమ్ముకున్నారని చెప్తోంది.
అయితే తమకు అందిన ఫిర్యాదు మేరకు సీఐడీ విచారణ మొదలు పెట్టింది. ఇందులో వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చింది. ఆయనతో పాటు శరత్ చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, ఆడిటర్లను ఈ కేసులో బాధ్యులుగా పేర్కొంది. ప్రస్తుతం విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డికి లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) లు జారీ చేసింది. విదేశాలకు తప్పించుకుని వెళ్లికుండా ఉండేందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీఐడీ ఈ సర్క్యులర్ (Look out circular) జారీ చేసినట్లు తెలుస్తోంది. అన్ని విమానాశ్రయాలకు నోటీస్ వెళ్లడం ద్వారా వాళ్లు దేశం దాటి వెళ్లకుండా నిరోధించేందుకు వీలవుతుంది. త్వరలోనే వీళ్లకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంలో తనను వైసీపీ నేతలు బెదిరించి రాయించుకున్నట్టు ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ కేసు చెల్లుబాటు కాదు. మరి ఇందుకు తగ్గ ఆధారాలను కేవీ రావు సమర్పిస్తే కేసు వైసీపీ నేతల మెడకు చుట్టుకున్నట్టే.













