అంతర్వేదిలో రధం దగ్థం…ఎగసిన నిరసన
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన అంతర్వేది లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవుడి ఊరేగింపు రధం దగ్ఘమైంది. ఆదివారం తెల్లవారుఝామున జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటనను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఖండించారు. ఘటనకు బాధ్యులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఇది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమని, వచ్చే రధోత్సవం లోపున కొత్త రధాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామస్థులు, విహెచ్పి కార్యకర్తలు ఆలయం ఎదుట నిరసనకు దిగారు. ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. సిసి కెమెరాలు ఆర్నెళ్ల నుంచి పనిచేయకపోతున్నా ఎందుకు మరమ్మత్తు చేయించలేదని ప్రశ్నించారు.
ఈ ఘటనపై ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. దాదాపు 60ఏళ్ల నాటి రధం దగ్థం కావడం అత్యంత విచారకరమైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. దీనికి బాధ్యలను గుర్తించేందుకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేశామన్నారు. దీని వెనుక కారకులు ఎవరైనా ఉంటే తప్పకుండా అదుపులోకి తీసుకుంటామని, వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. కొత్త రధం నిర్మాణం సోమవారమే ప్రారంభిస్తామని ప్రకటించారు.













