ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్టణానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద సంస్థ (సీసీఆర్‌ఏఎస్) కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కంట్లో వేస్తున్న మందు తప్ప, ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. అవి రావడానికి మరో మూడు వారాల సమయం పట్టొచ్చని అధికారులు తెలిపారు.
మిగతా మందులు ఆపొద్దు : ప్రభుత్వం సూచన
కరోనాకు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే వ్యక్తిగత విచక్షణ మేరకు ఆనందయ్య మందును వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆనందయ్య మందులు వాడుతున్నామన్న కారణంతో మిగిలిన మందులు ఆపొద్దని అధికారులు సూచించారు. అయితే ఈ మందు వాడితే కరోనా కచ్చితంగా తగ్గుతుందన్న ఆధారాలు మాత్రం ఏవీ లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే హాని కూడా లేదని ప్రకటించింది.