అప్పటి నుంచే నాపై కక్షగట్టారు : ఆనం
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికింది ఉమ్మడి నెల్లూరు జిల్లాయేనని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వెంకటగిరిలో నిర్వహించిన రా కదిలి రా సభలో ఆయన మాట్లాడుతూ ఈ జిల్లా నుంచే ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీని వీడి టీడీపీ అధినేత చంద్రబాబుతో నడిచేందుకు వచ్చామన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మాఫియా గ్యాంగ్‌లు పెరిగిపోయాయని, దానిపై గతంలో పోలీసుల సభలోనే మాట్లాడినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రమంతా ఈ సంస్కవృతి పెరిగిపోయిందని చెప్పానన్నారు. అప్పటి నునంచే తనపై కక్షగట్టారని అన్నారు. వెంకటగిరికి ఏది కావాలని అడిగినా ఆ అభ్యర్థనలను చెత్తబుట్టలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు కావాలని తాను అడగలేదని, పట్టణానికి వంద పడకల ఆస్పత్రి నిర్మాణం, సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువకు నిధులు కోరితే బుట్టదాఖలు చేశారన్నారు. గ్రామ పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల నిధులు మళ్లించారని, ఆ డబ్బు ఇవ్వాలని కోరితే తన నియోజకవర్గ ప్రజలను సీఎం జగన్ ఇబ్బంది పెట్టారన్నారు. సోమశిల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.













