ఏపీ ఇ-లెర్నింగ్ కు ‘అమృత’ సహకారం
క్లౌడ్ మేనేజ్మెంట్, మిషన్ లెర్నింగ్ అంశాలలో ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు ప్రఖ్యాత అమృతా యూనివర్శిటీ ముందుకొచ్చింది. ఇప్పటికే ఇ-గవర్నెన్స్ అమలుచేస్తున్న ప్రభుత్వానికి ఇ-ఎడ్యుకేషన్, ఇ-హెల్త్ తదితర విషయాలలో తమ వర్శిటీ అభివృద్ధి చేసిన వినూత్న సాంకేతికతను సమకూర్చడానికి సిద్ధమని వర్శిటీ ప్రతినిధి బృందం ప్రకటించింది. సోమవారం సాయంత్రం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో ప్రొఫెసర్ సుబ్బారావు ఆథ్వర్యంలో వర్శిటీకి చెందిన ప్రొఫెసర్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో రెండు గంటలకు పైగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. తమ విశ్వవిద్యాలయం రూపొందించిన ‘అమృతా ప్లాట్‌ఫామ్ ఫర్ లెర్నింగ్ అండ్ ఇ-గవర్నెన్స్’(ఆంపిల్) సాంకేతికత గురించి ముఖ్యమంత్రికి సవివరంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు.
తొలుత డిజిటల్, వర్చువల్ తరగతుల నిర్వహణకు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి సూచించారు. అలాగే, పరీక్షల నిర్వహణలో అమృతా వర్శిటీ అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలుచేయాలని చెప్పారు. ఏపీని వరల్డ్ బిగ్గెస్ట్ క్లౌడ్ మేనేజ్మెంట్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యమని అన్నారు.
క్లౌడ్ నెట్వర్క్ ఆధారంగా ఇంటర్నెట్ అవసరం లేకుండానే దూర ప్రాంతాల్లోని డివైస్‌లకు సమాచార మార్పిడి జరిపి వందలాది విద్యార్థులకు విద్యాబోధన జరపడాన్ని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి-తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 4వేల డిజిటల్ క్లాసురూముల్లో ఈ విధానాన్ని అమలుచేయాలని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, హెల్త్ సెంటర్లలో అమృతా వర్శిటీ అభివృద్ధి చేసిన సరికొత్త విధానాలను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. ఏపీలో వున్న అన్ని విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో అమృతా వర్శిటీ సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలుచేయాలని చెప్పారు. విశ్వవిద్యాలయానికి చెందిన అన్ని తరగతి గదుల్లో సర్వెలెన్స్ కెమెరాలు అమర్చి వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని ప్రశంసించారు. ఏపీకి సహకరించే అంశాలపై సమన్వయం చేసుకునేందుకు యూనివర్శిటీ తరఫున ఒక ప్రత్యేక బృందాన్ని నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఓపెన్ స్కూల్, ఓపెన్ వర్శిటీ పద్దతిలో రాష్ట్ర ప్రజానీకానికి లైఫ్ లాంగ్ లెర్నింగ్ విధానాన్నిఅందించడానికి కృషిచేస్తున్నామని, దీనికి అవసరమైన సాంకేతిక సహాయం అందించాలని కోరారు.













