ప్రపంచంలోనే సుందర ప్రాంతంగా అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచంలోనే సుందర ప్రాంతంగా అమరావతిని నిర్మిస్తున్నామన్నారు.
అమరావతి రాజధాని ని గ్రీన్ ఫీల్డ్ సిటీ – గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మిస్తున్నామన్నారు. 13 లక్షల sft తో కూడిన 4 వేల వాహనాలు పార్కింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాజధానిలో 1,375 ఎకరాల్లో పరిపాలనా నగరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 250 మీటర్ల ఎత్తులో ఐకానిక్ అసెంబ్లీ భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.
36 నెలల్లో శాశ్వత సచివాలయం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
దేశంలోనే అత్యంత భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్గా ఇది అరుదైన ఖ్యాతి గడిస్తుందని చంద్రబాబునాయుడు తెలిపారు. 12 వేల క్యూబిక్ మీటర్ల మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నామన్నారు. దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదేనన్నారు. రాజధానిలో నూతన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యంత భారీ భవంతులకు ధీటుగా, ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామన్నారు. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణశిల్పి నార్మన్ ఫోస్టర్కి చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్ సంస్థ శాశ్వత సచివాలయం కోసం 5 టవర్ల నిర్మాణానికి సంబంధించిన ఆకృతులను, నిర్మాణ ప్రణాళికలను రూపొందించాయన్నారు. ఈ 5 టవర్ల నిర్మాణానికి వేల మంది కార్మికులను, వందల సంఖ్యలో యంత్రాలను, టన్నుల కొద్ది నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నామన్నారు. ఫోస్టర్ అండ్ పార్టనర్ సంస్థ అద్భుత ప్రణాళిక, సీఆర్డీఏ పర్యవేక్షణలో శాశ్వత సచివాలయ నిర్మాణాన్ని 36 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
రాజధానిలో అందరికీ ఇళ్లు…
రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. రాజధానిలో ఉండే పేదలందరికీ ఇల్లు లేదనకుండా ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్రజా రాజధానిగా నిర్మిస్తున్న అమరావతిలో వివిధ జిల్లాల నుంచి వచ్చే పేదలకూ నివాసం యోగం కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం 50 వేల మంది నివాసం ఉండేలా జి ప్లస్ 3, జి ప్లస్ 4, జి ప్లస్ 5 తరహా అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామన్నారు. దేశంలో నూతన రాజధానులను నిర్మించారని, అవి పరిపాలన న
గరాలుగా మిగిలిపోయాయంటూ నయా రాయ్ పూర్, గాంధీనగర్ ల గురించి సీఎం చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. వాటి మాదిరిగా కాకుండా అమరావతిని ప్రజారాజధానిగా నిర్మించాలనే సంకల్పంతో అన్ని రకాల హంగులు కల్పిస్తున్నామన్నారు.
విజయవాడ, గుంటూరు నుంచి వచ్చి రాజధానిలో నివాసం ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
బౌద్ధ స్తూపం ఆకృతిలో హైకోర్టు…
బౌద్ధ స్తూపం ఆకృతిలో హైకోర్టు భవనం నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో న్యాయ పాలనకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఇందుకోసం తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధమవుతోందన్నారు. ముందుగా, విజయవాడలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయం నుంచి హైకోర్టు విధులు ప్రారంభమవుతాయన్నారు. తాత్కాలిక భవనం పూర్తి వినియోగంలోకి వచ్చిన తరవాత హైకోర్టును అక్కడికి తరలిస్తామన్నారు. శాశ్వత హైకోర్టు భవనం నిర్మాణం పూర్తయితే, తాత్కాలిక హైకోర్టు భవనాన్ని అక్కడికి తరలిస్తామని తెలిపారు.
రాజధాని రైతులపై ప్రశంసల జల్లు…
10 ఏళ్లు హైదరాబాద్ ను రాజధానిగా వినియోగించుకునే అవకాశమున్నా, రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రం విడిపోయిన తరవాత బస్సులోనే ఉండి, విజయవాడ నుంచి పాలన సాగించామని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం తాత్కాలిక సచివాలయం నిర్మించామన్నారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను సీఎం చంద్రబాబునాయుడు అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. చారిత్రికమైన నిర్మాణాల్లో రైతులు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.
అంతకుముందు శాశ్వత సచివాలయ భవనాల ర్యాఫ్ట్ ఫౌండేషన్ కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పైలాన్ ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, ఎంపీ కొనకళ్ల నారాయణ రావు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ జేఆర్. పుష్పరాజ్, శాసన సభ్యులు టి.శ్రవణ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ సీహెచ్. శ్రీధర్, గుంటూరు కలెక్టర్ కోన శశిధర్, ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు, రాజధాని రైతులు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.













