AP Liquor Scam : వైసీపీ మద్యం కుంభకోణంపై ED విచారణకు రంగం సిద్ధం..!?
ఆంధ్రప్రదేశ్‌లో (AP) మద్యం కుంభకోణం (Liquor Scam) వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణం వివరాలను టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (TDP MP Lavu Sri Krishnadevarayalu) పార్లమెంటులో ప్రస్తావించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah).. ఎంపీని పిలిపించుకుని మద్యం కుంభకోణం వివరాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. తాజాగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అమరావతిలో సీఎం చంద్రబాబుతో (CM Chandrababu) భేటీ అయ్యారు. ఢిల్లీ పరిణామాలను ఆయనకు వివరించారు. దీనిపై ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 మధ్య వైసీపీ పాలనలో మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద మద్యం స్కామ్‌లలో ఒకటి అని చెప్తోంది. దీని విలువ రూ.20వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL)ను వైసీపీ నాయకులు తమ ఆధీనంలో పెట్టుకుని అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మూడు స్థాయిలలో అవినీతి జరిగిందని ఎంపీ లావు పార్లమెంటులో వెల్లడించారు. ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్.. ఇలా అన్నింటినీ వైసీపీ నేతలు హస్తగతం చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం వాగ్దానంతో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ తర్వాత బినామీ కంపెనీలతో నాసిరకం మద్యాన్ని భారీగా ఉత్పత్తి చేసి అమ్మిందని ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ హయాంలో రూ.4 వేల కోట్ల సొమ్మును విదేశాలకు తరలించారని ఎంపీ లావు సంచలన ఆరోపణ చేశారు. ఈ డబ్బు బినామీ డిస్టిలరీల ద్వారా సేకరించిన అక్రమ లాభాల నుంచి వచ్చిందన్నారు. ఈ లావాదేవీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించాయని చెప్పారు. SPY ఆగ్రో ఇండస్ట్రీస్ వంటి పెద్ద డిస్టిలరీలను అక్రమంగా స్వాధీనం చేసుకుని.. తమ అనుకూల కొత్త కంపెనీలకు 60% ఉత్పత్తి సామర్థ్యాన్ని కేటాయించారని ఆయన వివరించారు. ఈ ప్రక్రియలో కమీషన్లు, అక్రమ లాభాలు ప్రధాన పాత్ర పోషించాయనేది ఆరోపణ.
లిక్కర్ స్కాంపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో APSBCL కార్యాలయాలపై ACB దాడులు నిర్వహించి రికార్డులను స్వాధీనం చేసుకుంది. మాజీ APSBCL ఎండీ వాసుదేవ రెడ్డితో (Vasudeva Reddy) సహా పలువురిపై CID కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) కూడా ఈ కుంభకోణంలో దోషులను వదిలిపెట్టబోమని అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)తో దర్యాప్తు చేయించాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ అంశంపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఢిల్లీ పరిణామాలను వివరించారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై CID విచారణ జరుపుతోంది. విదేశీ లావాదేవీలు జరిగినట్లు తేలడంతో దీన్ని ఈడీకి అప్పగించే అవకాశం కనిపిస్తోంది.













