MP vs MLA: అనంతలో ‘వాటాల’ వార్.. ఎంపీనే బెదిరించిన ఎమ్మెల్యే వర్గం?
ప్రజాసేవ ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు కొందరు నేతలు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న తాజా ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. అభివృద్ధి పనులు పక్కనపెట్టి, కాంట్రాక్టులు, కమీషన్ల కోసం సొంత పార్టీ నేతలే రోడ్డెక్కడం, ఒకరినొకరు బెదిరించుకోవడం రాజకీయ నైతికత పతనానికి పరాకాష్టగా నిలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం “కమీషన్ల రగడ” తారాస్థాయికి చేరింది. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ రైల్వే శాఖకు సంబంధించి సుమారు రూ. 7 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులను దక్కించుకుని స్థానికంగా పనులు చేయిస్తున్నారు. అయితే, ఈ పనులు గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో జరుగుతుండటంతో, స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నిబంధనల ప్రకారం టెండర్లు వేసి పనులు దక్కించుకున్నప్పటికీ, “మా నియోజకవర్గంలో మట్టి తీయాలన్నా, రాయి వేయాలన్నా మాకు వాటా ఇవ్వాల్సిందే” అని ఎమ్మెల్యే వర్గం హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా ఎమ్మెల్యే తమ్ముడు రంగంలోకి దిగి, ఎంపీ తమ్ముడికి ఫోన్ చేసి 10 శాతం కమీషన్ అంటే దాదాపు రూ. 70 లక్షలు డిమాండ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. సదరు కాంట్రాక్ట్ పనులు సాక్షాత్తూ ఎంపీవే అని, ఆయనే స్వయంగా చేయించుకుంటున్నారని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అవతలి వర్గం వినిపించుకోలేదని సమాచారం. “ఎంపీ అయితే మాకేంటి? మా ఏరియాలో పని చేస్తే మాకు ముట్టాల్సింది ముట్టాల్సిందే” అని తెగేసి చెప్పడం అక్కడి అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఈ వ్యవహారం అంతటితో ఆగలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా కమీషన్ కోసం వేధించడంతో, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. అధిష్టానం చెప్పినా ఎమ్మెల్యే వర్గం వెనక్కి తగ్గకపోగా, మరింత రెచ్చిపోయింది.
మరోసారి ఎమ్మెల్యే తమ్ముడు, ఎంపీ తమ్ముడికి ఫోన్ చేసి.. “అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా? వాళ్లు చెబితే మేము భయపడతామా? ఇక్కడ మేమే అధిష్టానం.. ఇది మా సామ్రాజ్యం. మర్యాదగా వాటా ఇస్తారా.. లేక సైట్లోని సామాన్లు ఎత్తుకుపోమంటారా?” అని బహిరంగంగానే బెదిరింపులకు దిగడం గమనార్హం. ఒక ఎంపీ స్థాయి వ్యక్తికే సొంత పార్టీలో రక్షణ లేకపోతే, ఇక సామాన్య కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో విసిగిపోయిన ఎంపీ, చివరికి పోలీసులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు మాత్రమే కాదు, ఒకే సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలు. సాధారణంగా కుల సమీకరణాలు, పార్టీ బంధాలు ఇలాంటి గొడవలను ఆపుతుంటాయి. కానీ, “ధనమూలం ఇదం జగత్” అన్నట్లుగా.. డబ్బు ముందు పార్టీ లేదు, పద్ధతి లేదు, బంధుత్వం లేదు అని ఈ ఘటన నిరూపిస్తోంది. ఒక ఎంపీనే, అది కూడా సొంత పార్టీ ఎంపీనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఒక ఎమ్మెల్యే వెళ్లారంటే, రాష్ట్రంలో అధికార పార్టీ నియంత్రణ కోల్పోయిందా? లేక స్థానిక ఫ్యూడల్ మనస్తత్వం రాజ్యమేలుతోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రజలు ఓట్లేసి గెలిపించింది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని, సమస్యలు పరిష్కరిస్తారని. కానీ నేతలు మాత్రం కాంట్రాక్టులు, కమీషన్లు, సెటిల్మెంట్ల పంచాయితీల్లో మునిగి తేలుతున్నారు. ప్రజాధనాన్ని ఎలా పంచుకోవాలి అనే విషయంలో పోటీ పడుతున్నారే తప్ప, ప్రజలకు ఏం చేయాలి అనే విషయంలో మాత్రం వారికి పట్టింపు లేదు. ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వీధి రౌడీల తరహాలో “సామాన్లు ఎత్తుకుపోతాం” అని బెదిరించుకోవడం రాజకీయ వ్యవస్థకే మాయని మచ్చ. పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎంపీకి వచ్చిందంటే, ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడిది? ఈ కమీషన్ల కక్కుర్తి రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారకముందే అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే, రాజకీయం అంటేనే దోపిడీ అనే భావన ప్రజల్లో మరింత బలపడే ప్రమాదం ఉంది.






