పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న అంబటి రాయుడు..!!
అంబటి రాయుడిని ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాలసిన అవసరం లేదు. టీమిండియా క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకున్న తెలుగు వ్యక్తి. అన్ని ఫార్మాట్లలో మంచి బ్యాట్స్ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తన ప్రతిభకు తగిన అవకాశాలు రాలేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. అందుకే తక్కువ వయసులోనే అంబటి రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించకపోయినా… అంబటి రాయుడు ఎందురో చేరతారో ఇప్పటికే అందరికీ దాదాపు ఒక క్లారిటీ వచ్చేసింది.
అంబటి రాయుడు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు అనుగుణంగా సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వచ్చారు. దీంతో ఆయన పాలిటిక్స్ లోకి రావడం ఖాయమనుకున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత తాను పూర్తిగా క్రికెట్ కు దూరమవుతున్నట్టు గతంలోనే అంబటి రాయుడు ప్రకటించారు. తాను ప్రాతినిధ్యం వహించిన చెనై సూపర్ కింగ్స్ ఫైనల్లో నెగ్గి ఐపీఎల్ కప్ సొంతం చేసుకుంది. తన క్రికెట్ ప్రస్తానం విజయంతో ముగిసింది. ముందే చెప్పినట్టు ఐపీఎల్ అవగానే ఆయన సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఐపీఎల్ ముగిసిన అనంతరం అంబటి రాయుడు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. దీంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఆయన పార్టీలో ఎప్పుడు చేరతారనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అంబటి రాయుడు గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన తెచ్చుకోవడానికే ఆయన పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సమస్యలు, యువత, విద్య, రైతులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల వారిని కలుసుకునేందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాక స్థానిక ఆలయాలు, మసీదులు, చర్చిలను కూడా సందర్శిస్తున్నారు. ఆయా కమిటీలకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు.
అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈసారి వైసీపీకి కాపులు దూరమయ్యారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంబటిరాయుడు లాంటి వారి ద్వారా కాపులను దగ్గర చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఆయన్ను గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గల్లా జయదేవ్ ఇక్కడ వరుసగా టీడీపీ నుంచి గెలిచారు. ఆయనకు చెక్ పెట్టేందుకు ఈసారి అంబటి రాయుడుని బరిలోకి దింపాలనుకుంటోంది వైసీపీ. ఒకవేళ ఈసీటు కాకపోతే మచిలీపట్నం పార్లమెంటు స్థానమైనా ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది.













