ఏపీని ఊపేస్తున్న ‘బ్రో’ పాలిటిక్స్..!!
పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రో ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ శ్యాంబాబు అనే క్యారెక్టర్ చేశారు. ఇది ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి తీశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సంక్రాంతి సందర్భంగా అంబటి రాంబాబు డ్యాన్స్ చేశారు. అదే టీషర్ట్, స్టెప్పులతో పృధ్వీ కూడా బార్ లో డ్యాన్స్ చేస్తాడు. ఇది తనను కించపరచడానికేనని అంబటి రాంబాబు కూడా ప్రకటించారు. ఇలాంటి సినిమాలు తీసేముందు దర్శక రచయితలు ఆలోచించుకోవాలని.. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు కూడా. ఇది తీవ్ర దుమారానికి దారి తీసింది.
అంతటితో ఆగకుండా పవన్ కల్యాణ్ ఒరిజినల్ క్యారెక్టర్ తో తాము కూడా ఓ సినిమా తీయనున్నట్టు ప్రకటించారు. అందుకోసం పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. నిత్య పెళ్లికొడుకు, పెళ్లిళ్లు పెటాకులు, తాళి ఎగతాళి, మూడు ముళ్లు – ఆరు పెళ్లిళ్లు, బహుభార్యా ప్రావీణ్యుడు, MRO- మ్యారేజెస్, రిలేషన్స్, అఫెండర్.. లాంటి టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు అంబటి ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్టు వెల్లడించారు. అంతేకాక బ్రో మూవీ నిర్మాత ద్వారా హవాలా సొమ్మును చంద్రబాబు పవన్ కల్యాణ్ కు ప్యాకేజీగా ఇస్తున్నట్టు ఆరోపించారు. దీనిపై ఢిల్లీ వెళ్లి కేంద్ర దర్యాప్తు సంస్థళకు ఫిర్యాదు చేయనున్నారు. వీటిపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. అసత్య ఆరోపణలు సరికాదన్నారు.
అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్ పై సినిమా తీస్తున్నట్టు ప్రకటించగానే జనసైనికులు కూడా రెచ్చిపోయారు. అంబటి రాంబాబు బయోపిక్ కు వెంటనే తిరుపతిలో క్లాప్ కూడా కొట్టేశారు. సందులో సంబరాల శ్యాంబాబు SSS @ రాంబాబు పేరుతో ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఓ డ్యాన్స్ సన్నివేశాన్ని ముహూర్తపు షాట్ గా చిత్రీకరించారు. ముంబై రెడ్ లైట్ ఏరియా నుంచి కొంతమంది హీరోయిన్లను ఈ సినిమా కోసం తీసుకోనున్నట్టు తెలిపారు. అక్కడ వీలుకాకపోతే కోల్ కతలోని చాందినీ గంజ్ నుంచి తీసుకొస్తామన్నారు. సినిమాతో పాటు మరిన్ని వెబ్ సిరీస్ లు కూడా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు జనసేన నేత పోతిన మహేశ్ వెల్లడించారు. ఇందుకోసం పలు పేర్లు పరిశీలిస్తున్నట్టు మీడియాకు వివరించారు. ఒక తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093, AXE, డాటర్ ఆఫ్ వివేకా, గంజాయి.. మిస్ అయిన అమ్మాయి.. మధ్యలో ఇసుక దిబ్బలు, కోడి కత్తి సమేత శ్రీను, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అద్దె ఇల్లు, ఓ ఖైదీ వదిలిన బాణం.. లాంటి పేర్లను పెట్టే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు.
మొత్తానికి మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు.. పవన్ కల్యాణ్ సినిమాను టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం పెద్ద దుమారమే రేపుతోంది. ఇప్పుడు జనసైనికులు కూడా అంతకు రెండింతల ఉత్సాహంతో అంబటిని, జగన్ ను టార్గెట్ చేశారు.













