సుప్రీం కోర్టు వ్యాఖ్యలు మూడు రాజధానుల నిర్ణయానికే మద్దితిస్తున్నాయి: అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. రాజధాని విషయంలో నిర్మాణాలకు టైం పెడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ విషయంలో పూర్తి స్థాయి స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే తాజాగా రాజధాని విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికే బలాన్ని చేకూరుస్తున్నాయని, రాజధానిని 3 లేదా 6 నెలల్లో నిర్మించాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనిని బట్టి రాజధాని విషయంలో న్యాయస్థానాల జోక్యం సరైనది కాదని స్పష్టమవుతుందని చెప్పుకొచ్చారు. ఈ స్టే అమరావతి యాత్రకు బ్రేక్ పడినట్లేనని, అమరావతి రాజధాని అని అప్పట్లో గ్రాఫిక్స్ చూపించడమే తప్ప నిర్మించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రారంభమైనప్పటికీ ఇక్కడ నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. రైతుల ముసుగులో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నించారని, అమరావతిలో ఉన్న నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రాజధానికి అడ్డంకులు సృష్టించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని సూచించారు.













