Chandrababu: విదేశీ పర్యటనలపై పారదర్శకత లేదు.. చంద్రబాబు పై అంబటి ఫైర్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సింగపూర్ (Singapore) పర్యటనపై రాజకీయ వేడి పెరుగుతోంది. అధికార టీడీపీ (TDP) ప్రభుత్వం ఈ పర్యటనను పెట్టుబడులు తేవడం కోసమేనని చెబుతుండగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు మాత్రం దీని వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. చంద్రబాబు ఇప్పటివరకు సింగపూర్‌కు 58 సార్లు వెళ్లినప్పటికీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదని ఆయన ఆరోపించారు. తాజా పర్యటన కూడా ప్రజలకు ఉపయోగపడే లక్ష్యంతో కాదని, పాత లావాదేవీలు సెటిల్ చేసుకోవడమే అసలు ఉద్దేశమని పేర్కొన్నారు.అంతేకాదు, సింగపూర్‌లో మునుపటి మంత్రి పదవిలో అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన ఈశ్వరన్ (S. Iswaran) ఇటీవల విడుదలయ్యారని, ఆయన్ను కలవడం కోసమే చంద్రబాబు వెళ్లారని అంబటి ప్రశ్నించారు. ప్రజాధనంతో చేసే విదేశీ పర్యటనలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు.
ఇక మరోవైపు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చేసిన ఆరోపణలపై కూడా అంబటి స్పందించారు. లోకేష్ తన ట్వీట్లో సింగపూర్ ప్రభుత్వానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Peddireddi Ramachandra Reddy) సంబంధాలున్న వ్యక్తి మెయిల్స్ పంపారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై అంబటి వివరంగా స్పందిస్తూ, చిలకలూరిపేట (Chilakaluripet) ప్రాంతానికి చెందిన మురళీకృష్ణ చౌదరి (Murali Krishna Chowdary) అనే వ్యక్తి యుఎస్‌లో ఉంటున్నారని, ఆయన టీడీపీకి దూరమై బాధతో మద్యం సేవించి ఆవేశంలో సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్స్ పంపారని చెప్పారు.
అతనిపై టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఆస్తుల విషయంలో ఒత్తిడి తీసుకువచ్చారని, దాంతోనే ఆయన ఆ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారని అంబటి వివరించారు. ఇది తెలిసినప్పటికీ, దాన్ని వక్రీకరించి పెద్దిరెడ్డి మీద ఆరోపణలు చేయడమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వ నేతలు తమ పర్యటనలపై పూర్తిగా వివరాలు వెల్లడించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ప్రజాధనాన్ని వినియోగించే కార్యక్రమాల్లో పూర్తి పారదర్శకత ఉండాలన్న డిమాండ్‌కు అంబటి వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి.