Ambati Rambabu: చంద్రబాబు మాటతప్పారు.. విపక్ష వైసీపీ విసుర్లు…
ప్రజలారా అర్థం చేసుకోండి.. గతంలో వైసీపీ(YCP) పాలనలో వెంటిలేటర్ మీదున్న రాష్ట్రాన్ని ఇప్పుడు స్థీరీకరించాం. అయితే అది కాస్తా అభివృద్ధిలో పరుగులు పెట్టడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్నారు సీఎం చంద్రబాబు(Chandra babu). గత వైసీపీ పాలనలో విధ్వంసం.. ఊహించినదానికన్నా చాలా అధికంగా ఉందన్నారు. ప్రజలు ఈవిషయం అర్థం చేసుకోవాలని సూచించారు. ఉన్నపళంగా అభివృద్ధి చేయాలంటే డబ్బులు ఉండాలి కదా అన్నారు చంద్రబాబు.
అయితే దీనిపై విపక్ష వైసీపీ మండిపడింది. సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామంటూ ఎన్నికల వాగ్దానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేశారని ఆరోపించింది! తన మార్కు రాజకీయాన్ని ప్రజలకు మరోసారి రుచి చూపించారని ఎద్దేవా చేసింది. కేంద్రం ఇస్తున్న డబ్బులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. సంపద సృష్టించి.. ఆదాయం పెరిగితే.. అప్పుడు రైతు భరోసా, తల్లికి వందనం అమలు చేస్తామంటున్నారని దుయ్యబట్టింది.
ఎన్నికల సమయంలోనే ఆ విషయాన్ని జగన్ చెప్పారని.. అయితే మేం చేస్తామంటూ ప్రజావిశ్వాసాన్ని పొంది, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu) చెప్పారు. నీతి ఆయోగ్ లెక్కలంటూ.., వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థి క వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఏ హామీనీ అమలు చేయలేనని ప్రకటించడం చంద్రబాబు దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు.
అయినా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు అంబటి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ విష ప్రచారం చేశారని, ఆ తర్వాత వారు ప్రవేశ పెట్టిన బడ్జెట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు రూ.6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారని వివరించారు. అంటే చంద్రబాబు ఊహించిన దానికన్నా అప్పులు 50 శాతం తక్కువేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. అయినా ఆర్థి క పరిస్థితి అధ్వానంగా ఉందని, వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులే కారణమని ఎలా చెబుతారని నిలదీశారు.













