Ambati Rambabu: పవన్ సినిమాపై అంబటి స్పందన.. నిజమా లేక వ్యంగ్యమా?

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో ఉన్నంతకాలం వైసీపీ (YSRCP) నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందన తప్పనిసరి అన్నట్టే ఉంది. ముఖ్యంగా పవన్ సినిమాల విషయం వచ్చిందంటే ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేయడం అందరికీ తెలిసిందే. గతంలో “బ్రో” సినిమా వచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. “గెలిచినవాడి డ్యాన్స్ సంక్రాంతి… ఓడిపోయినవాడిది కాళరాత్రి” అని చెప్పిన అంబటి రాంబాబు, ఇప్పుడు మాత్రం మూడ్ మార్చినట్లుగా కనిపిస్తున్నారు.
ఈ శుక్రవారం విడుదల కానున్న పవన్ కల్యాణ్ కొత్త చిత్రం “హరిహర వీరమల్లు” (Hari Hara Veera Mallu)పై అంబటి రాంబాబు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (Twitter)లో ఆశ్చర్యకరంగా పాజిటివ్ టోన్ లో స్పందించారు. పవన్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, కనక వర్షం కురవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. గతంలో ఎప్పుడూ ఆయన సినిమాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన అంబటి ఇప్పుడు ఇలా ట్వీట్ చేయడం వెనుక వేరే ఉద్దేశం ఉందా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
ఇక వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇప్పటికే కొన్ని సినిమాలపై బాయ్‌కాట్ (Boycott) పిలుపులతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన “లైలా” అనే చిత్రం ఇదే కారణంగా నిరాశ ఎదుర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు “హరిహర వీరమల్లు”కి కూడా అదే తరహాలో విరుద్ధ ప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్, “బాయ్‌కాట్ అంటే దేనికి? ఎందుకు?” అని ప్రశ్నిస్తూ, సినిమాలు ఎవరూ గన్ పాయింట్ పెట్టి చూపించరని, జనాలు టికెట్ కొనుక్కొని ఇష్టపడి చూస్తారని చెప్పారు.
తన చిన్నప్పటి అనుభవాలను గుర్తుచేస్తూ, అప్పట్లో టికెట్లు దొరకకపోతే బ్లాక్‌లో కొని సినిమాలు చూసేవాడినని తెలిపారు. సినిమాల విషయంలో ఎవరైనా ఇష్టపడితే చూస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు కానీ బలవంతంగా బాయ్‌కాట్ చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విపక్షాలు ఉండటం సహజమని, వారు ఎలాంటి ప్రచారం చేసినా అది తగిన స్థాయిలోనే ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు అనంతరం సోషల్ మీడియాలో మరోసారి పవన్ చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే… అంబటి రాంబాబు ట్వీట్ నిజమైన అభినందనవా లేక వ్యంగ్యమా అర్థం కావడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.