స్మార్ట్ సిటీగా అమరావతి
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని స్మార్ట్ సిటీగా రూపుదిద్దేందుకు ప్రభుత్వ కసరత్తు ప్రారంభించింది. ఎలక్ట్రికల్ బస్సులు, బ్యాక్టరీ వాహనాలు, సోలార్ విద్యుత్ ప్యానల్స్, బహుళ అంతస్తులనిర్మాణాలు, బయోపార్కులు, సెన్సార్లు, థర్మల్ రాడర్స్ లాంటి అత్యాధునిక సౌకర్యాలు నెలకొల్పేందుకు సిఆర్డీయే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమరావతిని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ఎంపిక చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. అమరావతి స్మార్ సిటీగా ఎంపికైతే తద్వారా వచ్చే నిధులతో మరెన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం సమకూర్చే నిధులను మూలధనంగా చూపించి జైకా, ప్రపంచ బ్యాంక్, హడ్కోల నంచి సుమారు రూ.500 కోట్లు రుణం పొందేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. స్మార్ట్ సిటీగా ఎంపికైనా ఏ నగరానికైనా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే సంబంధిత నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒక ఎస్పివిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో 50శాతం నగర పాలక సంస్థ మిగిలిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. అమరావతి ఇంకా స్వపరిపాలన సంస్థ కాకపోవడంతో సిఆర్డిఏ ప్రధాన భాగస్వామిగా ఉంటుంది.













