తుళ్లూరు నుంచి తిరుపతికి మహాపాదయాత్ర
ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపును నిరసిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మహాపాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా వెలగపూడిలో అమరావతి జేఏసీ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజధాని గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు ఈ సమావేశానికి హాజరయ్యారు. చేపట్టబోయే మహాపాదయాత్ర విధి, విధానాలు, నిర్వహణ కమిటీల ఏర్పాటు సహా పలు విషయాలపై చర్చించారు. తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి వరకు మొత్తం 45 రోజులపాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అంటే నవంబరు 1న మొదలై డిసెంబరు 17న ముగుస్తుంది. ఆ రోజు నాటికి ఉద్యమం ప్రారంభమై రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.













