మళ్లీ రాజుకోనుందా…రాజధాని ఉద్యమం…?
మరోసారి అమరావతి రాజధాని ఉద్యమం రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం శాసనసభ తొలిరోజు గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానులపై ప్రకటన చేయడం అది చాలదన్నట్టుగా సి.ఆర్.డిఎ, రద్దు మూడు రాజధానులు బిల్లులు శాసనసభలో ఆమోదం పొందడంతో మరోసారి అమరావతి వేదికగా ఉద్యమం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం బిల్లులు ఆమోదించుకోవడంపై ఏపీసిసి సమన్వయ కమిటి సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సిపిఐ నేతలూ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అలాగే అమరావతి పరిరక్షణ సమితి కోర్ కమిటీ కూడా సమావేశం ఏర్పాటు చేయాలని, ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి సిద్ధమవుతోంది.. అన్ని పార్టీలతో ఈ విషయంపై జేఏసీ సంప్రదింపులు జరిపుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న ఆనాలోచిత, ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టిందని, ఈ విషయంలో కూడా మరోసారి ప్రభుత్వానికి చుక్కెదురు కాక తప్పదని జెఎసి ప్రతినిధులు అంటున్నారు.
కరోనా కారణంగా 60 రోజుల నుంచి తాము ఆగామని, ఇక మరోసారి తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి చవి చూపక తప్పదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ తాజా చర్యలతో రాజధాని రైతుల జీవితాల్లో చీకటి నింపినందుకు ప్రతిరోజు గ్రామాలలో గంటపాటు విద్యుద్దీపాల ని ఆపేయాలని నిర్ణయించుకున్నామని వీరు చెప్పారు. దీనిలో భాగంగా సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలో విద్యుత్ దీపాలు ఆపివేస్తామన్నారు. అలాగే ముఖ్య మంత్రి ఇంటి నుంచి అసెంబ్లీకి వెళ్లే దారి మొత్తం కూడా నల్ల జెండాలను కట్టి నిరసన తెలియజేస్తామన్నారు. ఇకపై అమరావతి జేఏసీ మహిళలు మరింత తీవ్రంగా ప్రభుత్వంపై ధ్వజమెత్తుతారని, 3 రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకునే దాకా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కరోనా నేపధ్యంలో ప్రభుత్వం మళ్లీ రాజుకుంటున్న ఉద్యమంపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.













