అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చిన అమరావతి ఉద్యమం
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు సంఫీుభావం ప్రకటించాయి. 2019 ఎన్నికల తర్వాత అన్ని పార్టీల నాయకులు ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వర్ల రామయ్య, పరిటాల సునీత, గౌతు శిరీష, శ్రావణ్ కుమార్, సీపీఐ నేతల నారాయణ, రామకృష్ణ, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, జనసేన నేత రామదాసు చైదరి, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిశోర్‌బాబు, పాతూరి నాగభూషణం, సినీనటుడు శివాజీ, కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, మస్తాన్ వలీ తదితరులు హాజరయ్యారు.
రైతులతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలిరావడంతో సభా ప్రాంగణంలోని గ్యాలరీలు నిండిపోయాయి. ఆకుపచ్చ కండువాలు, టోపీలతో ప్రజలు సభకు హాజరుకావడంతో తిరుపతి నగరం ఆకుపచ్చగా మారింది. జై అమరావతి నినాదాలతో మార్మోగింది. అమరాతి ఉద్యమానికి అండగా ఉన్నామంటూ వివిధ పార్టీల నేతలు రైతులకు భరోసా కల్పించారు.













