400వ రోజుకు చేరిన రాజధాని ఉద్యమం…
ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 400వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి రైతులు రాజధాని గ్రామాల్లో భారీ ర్యాలీ చేపట్టారు. తుళ్లూరులో ప్రారంభమైన ర్యాలీ రాజధాని పరిధిలోని పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్లమాను, హరిశ్చంద్రపురం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం మీదుగా మందడం వరకు సాగింది. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు.
అమరావతి నుంచి రాజధాని తొలగించాలనే కుట్రతో ప్రభుత్వం ఇప్పటివరకూ ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసిందని వాటన్నింటినీ అధిగమించి రాజధాని కోసం పోరాడుతున్నట్లు రైతులు తెలిపారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రభుత్వం చెప్పిన మాటలు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసత్యమని తేలిందని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అన్నారు. హైకోర్టును ఇక్కడ నుంచి కర్నూలుకు తరలించాలని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను వారు తప్పుపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు సృష్టం చేశారు.













