అమరావతి ఉద్యమానికి 250 రోజులు
రాజధాని అమరావతి ఉద్యమం 250 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజధాని రణభేరి పేరుతో మందడం, తుళ్లూరు, వెలగపూడి, దొండపాడులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు, మహిళలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. రాజధాని ప్రజల దుస్థితిపై బతుకు జట్కాబండి రూపకం ప్రదర్శించారు. అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. గుంటూరు వసంతరాయపురంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ఉద్యమం 250వ రోజుకు చేరినా సర్కారులో చలనం లేదన్నారు. అడ్డగోలు నిర్ణయాలతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అమరావతి విషయంలో బీజేపీ ద్వంద వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఐదు కోట్ల మందికి న్యాయం జరగాలంటే అమరావతే రాజధానిగా ఉండాలన్నారు. సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు.













