త్వరలో అమరావతి పాదయాత్ర పున: ప్రారంభిస్తాం
మహాపాదయాత్ర నిలుపుదల చేసిన రామచంద్రాపురం నుంచే త్వరలోనే యాత్రను పున ప్రారంభిస్తామని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. రైతుల పాదయాత్రను నిలుపుదల చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ రైతులతో, సమన్వయ కమిటీలతో సమావేశం నిర్వహించి ప్రారంభ తేదీని 3, 4 రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వానికి కోర్టు తీర్పు ద్వారా ఇకనైనా బుద్ది రావాలని, పాదయాత్రకు అడ్డంకులు సృష్టించకూడదని హితవు పలికారు.
పాదయాత్ర దివ్య రథానికి అమర్చిన సీసీ కెమెరాలను పోలీసులు తీసుకెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా సీసీ కెమెరాలు తీసుకెళ్లిన పోలీసులపై ప్రైవేటు కేసు వేస్తున్నామని తెలిపారు. ర్ఱాష్టానికి ఏకైక రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని విశాఖ అన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై రాయలసీమ వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.













