సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి ప్రాంత రైతులు
రైతులు ఆర్-5 జోన్ వ్యవహారంపై అమరావతి ప్రాంత రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై ఈనెల 14న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. 10న విచారణకు తీసుకోవాలని రైతుల తరపున న్యాయవాది కోరగా ఆ రోజు కేసుల జాబితా ఇప్పటికే తయారైందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. అందుకే ఈ పిటిషన్‌ను 14న విచారణకు తీసుకుంటామని తెలిపారు. అమరావతి రైతులు ఆర్`5 జోన్‌పై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)లో మార్పులు చేస్తూ ఆర్`5 జోన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.













