త్వరలో అమరావతి డిక్లరేషన్ : కోడెల
వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు, విద్యార్థినునలు అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో అమరావతి ముసాయిదా డిక్లరేషన్‌లో మార్పులు చేర్పులు చేశామని, త్వరలో దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తారని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో అమరావతి డిక్లరేషన్‌పై కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడకు సమీపంలోని పవిత్ర సంగమం వద్ద ఫిబ్రవరిలో మూడు రోజులపాటు జాతీయ మహిళాపార్లమెంట్ జరిగిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ ప్రకటన రూపొందిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు, స్వీకరించి, ఇప్పటి వరకు మూడుసార్లు సమావేశాలు నిర్వహించి, మహిళా సమస్యలను విస్తవృత స్థాయిలో చర్చించి, డిక్లరేషన్‌లో మార్పులు, చేర్పులు చేసి తుది రూపం ఇచ్చినట్లు తెలిపారు. అన్ని విధాల మహిళలకు సహాయపడే విధంగా దీనిని రూపొందిస్తున్నట్లు తెలిపారు. పది అంశాలతో అర్థవంతమైన రీతిలో, అందరికీ ఉపయోగపడే విధంగా ఒక బెంచ్‌మార్క్‌గా దీనిని తయారు చేస్తునట్లు స్పీకర్ తెలిపారు.








