బీఎస్ ఈలో అమరావతి బాండ్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో నేడు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియను వాణిజ్య పరిభాషలో ఆంగ్లంలో లిస్టింగ్ గా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫాంపై బాండ్లను జారీ చేయగా కేవలం గంట వ్యవధిలోనే మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. అవే బీఎస్ఈలో నేడు లిస్టింగ్ కానున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆహ్వానించేందుకు చంద్రబాబు పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్, అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు.













