అమరావతి, విశాఖకు పురస్కారాలు
జాతీయస్థాయి ఆకర్షణీయ నగరాల పోటీలో విశాఖకు రెండు, అమరావతికి ఒక అవార్డు దక్కింది. విశాఖ నగరంలో ప్రారంభమైన స్మార్ట్ సిటీ నగరాల సమావేశాల్లో.. ఆకర్షణీయ ప్రాజెక్టు పనుల్లో పురోగతి, పనితీరు ఆధారంగా అమరావతి (సీఆర్డీఏ) కమిషనర్, స్మార్ట్ అమరావతి సీఈవో లక్ష్మీనరసింహం, విశాఖ జీవీఎంసీ కమిషనర్ సృజనలకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా, సంయుక్త కార్యదర్శి కునాల్‌కుమార్ అవార్డుల్ని అందించారు. దేశంలోని తొలిసారిగా విశాఖలోని ముడసర్లోవ జలాశయంపై ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల తేలియాడే సౌరవిద్యుత్తు ప్లాంటుకు వినూత్న ఆలోచన అవార్డు దక్కింది. జాతీయస్థాయిలో ఉత్తమ స్మార్ట్ సిటీగా సూరత్ ఎంపికైంది. వడోదర, ఇండోర్, పుణె, కోయంబత్తూరు, వెల్లూర్, ఈరోడ్, సాగర్, రాజ్‌కోట్, రాంచీ, కాన్పుర్, అహ్మదాబాద్ నగరాలకు ఒక్కో అవార్డు, సూరత్‌కు మొత్తంగా 3 అవార్డులు దక్కాయి.













