300వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
అమరావతి అన్నదాతల నిరసనలు 300వ రోజున రాజధాని గ్రామాల్లో హోరెత్తాయి. మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి ప్రాంతాల్లో నినాదాలతో మార్మోగాయి. ఆకుపచ్చ చీరలు ధరించి మహిళలు నిరసనలో పాల్గొన్నారు. వెలగపూడి దీక్షాశిబిరం వద్ద తెలుగుతల్లి, అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. రాజధాని పోరాటంలో అమరులైన 92 మంది ఉద్యమకారులకు నివాళులర్పించారు.
300 రోజులుగా అమరావతి రాజధానే ఆశయంగా పోరాడుతున్న రైతులకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు నిలిచాయి. టీడీపీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ దీక్షలు, ర్యాలీలు చేపట్టారు. తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. రాజధాని ప్రాంత ప్రజలకు మద్దతు తెలుపుతూ టీడీపీ నేతలు, ప్రజాసంఘాలు దీక్షలు చేపట్టాయి. గుంటూరులో తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిరసన దీక్ష చేశారు. పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్ల బెల్లూను ఎగురవేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అమరావతి పరిరక్షణ కోసం మూడు వేల రోజుల వరకైనా ఉద్యమిస్తామని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తేల్చి చెప్పారు.













