2019 మార్చి 31కి అమరావతి పరిపాలన నగరం సిద్ధం
విజయదశమికి నిర్మాణ పనులు ప్రారంభించి 2019 మార్చి 31 నాటికి రాజధానిలో పాలనా నగరాన్ని సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కార్య ప్రణాళికను ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రి ముందుంచారు. ఆగస్టు 15 నాటికి శాసనసభ, 30 నాటికి హైకోర్టు భవంతుల తుది ఆకృతులను ఫోస్టర్ అండ్ పార్టనర్స్ అందించనున్నారని తెలిపారు. దీన్ని అనుసరించి పరిపాలన నగర నిర్మాణ పనుల కార్యప్రణాలికను సిద్ధం చేశామని చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణ పురోగతిపై సీఆర్డీఏ, ఎడీసీ అధికారులతో సమీక్షించారు.
25 ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు అమరావతికి రావడానికి ఆసక్తి కనబర్చాయని, వాటిలో 14 సంస్థలు గత వారం జరిగిన వర్క్ షాపులో పాల్గొన్నాయని సీఆర్డీఏ కమిషనర్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. వ్యాలీ స్కూల్, కెఎఫ్ఐ, చిరెక్, ఆర్ఎన్ పోడార్ స్కూల్, నలందా, చిన్నయా విద్యాలయ, రామకృష్ణ మిషన్ స్కూల్, గ్లిండన్, పొదార్ ఇంటర్నేషనల్, రయాన్ గ్లోబర్ స్కూల్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో కూడిన పాఠశాల విద్య కోసం దేశ మొత్తం అమరావతి వైపు చూసేలా ప్రఖ్యాత విద్యా సంస్థలను ఇక్కడికీ తీసుకురావాలని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకోసం అవసరమైన భూమిని అవసరమైతే ఉచితంగా అందించేందుకైనా సిద్ధమని అన్నారు. ధీరూభాయ్ అంబానీ ట్రస్టు తమ విద్యా సంస్థను అమరావతిలో నెలకొల్పేందుకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.













