చీరాలలో మళ్లీ ఆమంచి వర్సెస్ కరణం..!
ప్రకాశం జిల్లాలో చీరాల రాజకీయం వేరు. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రతి ఐదేళ్లకోసారి ఇక్కడ రాజకీయం మారుతూ ఉంటుంది. గతంలో ఆమంచి కుటుంబం ఈ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకుంది. అయితే కరణం ఫ్యామిలీ సడన్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఒకే పార్టీలో ఉన్నా ఈ నియోజకవర్గంలో ఆమంచి, కరణం వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తూనే ఉంది. అధిష్టానం జోక్యంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినా ఇప్పుడు మరో రూపంలో ఆమంచి, కరణం వర్గాల మధ్య వార్ మొదలైంది. అయితే ఇప్పుడు పార్టీలు మారాయంతే.
2019ఎన్నికల వరకూ చీరాలలో ఆమంచి వర్గీయులదే పెత్తనం. ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు. అయితే 2019ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడ పోటీ చేసిన కరణం బలరాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కరణం బలరాం ఫ్యామిలీ టీడీపీ నుంచి వైసీపీలో చేరింది. దీంతో ఒకే పార్టీలో ఆమంచి, కరణం వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాంకే వైసీపీ అధిష్టానం ఫుల్ పవర్స్ ఇచ్చింది.
ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో టికెట్ల పంచాయితీ మొదలైంది. దీనికి చెక్ పెట్టేందుకు వైసీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఆమంచిని పర్చూరు నుంచి పోటీ చేయాలని ఆదేశించింది. మొదట్లో ససేమిరా అన్నా.. ఆ తర్వాత ఓకే చెప్పారు. దీంతో చీరాల నుంచి కరణం ఫ్యామిలీ, పర్చూరు నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేయడం ఖరారైంది. దీంతో చీరాలలో ఆమంచి, కరణం ఫ్యామిలీల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పడిందని అందరూ భావించారు. అయితే అది జరగట్లేదు. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ స్థానంలో ఆమంచి స్వాములు రంగంలోకి దిగారు.
ఆమంచి కుటుంబంలో అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీలో ఉన్నారు. గతంలో చీరాలలో తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్, అన్న ఆమంచి స్వాములు కలిసి రాజకీయం చేశారు. అయితే ఆమంచి స్వాములు ఇప్పుడు తమ్ముడిని వదిలి జనసేనలో చేరారు. ఆమంచి కృష్ణమోహన్ పర్చూరుకు వెళ్లినా స్వాములు మాత్రం చీరాలలోనే మకాం వేశారు. తాజాగా కరణం వెంకటేశ్.. ఆమంచి కృష్ణమోహన్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటిపై స్పందించిన ఆమంచి స్వాములు .. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీంతో చీరాలలో మళ్లీ ఆమంచి, కరణం ఫ్యామిలీల మధ్య వార్ మొదటికొచ్చిందని స్థానికులు భావిస్తున్నారు.













