ఆమంచి, కరణం మధ్య సయోధ్య సాధ్యమేనా…?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నియోజకవర్గాలపై పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి చాలా నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రాంతీయ సమన్వయ కర్తలను రంగంలోకి దింపింది అధిష్టానం. బాపట్ల జిల్లాలో కరణం, ఆమంచి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. దీన్ని ఎలాగైనా చక్కదిద్దాలని పార్టీ అధినేత జగన్.. సమన్వయ కర్త విజయసాయి రెడ్డికి అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన విజయసాయి రెడ్డి.. నేతలందరితో పర్సనల్ గా మాట్లాడారు. వాళ్ల సయోధ్య కుదిరిందని.. సమస్య ఏదీ లేదని విజయసాయి వెల్లడించారు. అయితే అది సాధ్యమేనా.. అనే అనుమానాలు ఇరు వర్గాల్లో వినిపిస్తున్నాయి.
పర్చూరు, చీరాల.. నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలలో కీలకమైనవి. గతంలో చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ పలు సందర్భాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అక్కడి నుంచి టీడీపీ తరపున కరణం బలరాం గెలుపొందారు. ఎన్నికల అనంతరం.. కరణం బలరాం కుటుంబం వైసీపీలో చేరింది. దీంతో ఆమంచి, కరణం కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. తానే మొదటి నుంచి చీరాలలో ఉన్నానని.. తాను ఇక్కడే పని చేస్తానని ఆమంచి పట్టుబట్టారు. అయితే తాను ఇప్పుడు ఇక్కడ గెలిచాను కాబట్టి తాను వదులుకునే ప్రసక్తే లేదని కరణం బలరాం స్పష్టం చేశారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించడం అధిష్టానానికి పెద్ద సమస్యగా మారింది.
రెండు వర్గాల మధ్య నిత్యం ఆధిపత్య పోరు నడుస్తుండడంతో వైసీపీ అధిష్టానం కొంతకాలం క్రితం ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గానికి పంపించింది. అక్కడ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమించింది. దీంతో ఇకపై ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నుంచి పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చింది. ఇదే విషయాన్ని ఆయనకు కూడా వివరించింది. దీంతో అయిష్టంగానే పర్చూరులో మకాం వేశారు ఆమంచి కృష్ణమోహన్. అయినా అడపాదడపా చీరాలలో వేలు పెడుతూనే ఉన్నారు. ఇది కరణం బలరాం జీర్ణించుకోలేకపోయారు. తాను ప్రాతనిధ్యం వహిస్తుండగా ఆమంచి జోక్యం చేసుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. దీంతో మరోసారి సమస్య మొదటికొచ్చింది.
వీళ్లిద్దరూ ఇలాగే గొడవ పడుతూ ఉంటే పార్టీకి నష్టమని భావించిన జగన్.. విజయసాయి రెడ్డిని రంగంలోకి దింపారు. ఆయన నేతలందరితో విడివిడిగా సమావేశమయ్యారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, కరణం బలరాం, కరణం వెంకటేశ్, ఆమంచి కృష్ణమోహన్ తదితరులతో సుదీర్ఘంగా చర్చించారు. ఎవరి నియోజకవర్గంలో వాళ్లు పని చేసుకోవాలని.. మరొకరి నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయసాయి రెడ్డి చెప్పిన మాటలకు నేతలందరూ అంగీకరించారు. అయితే ఇది అంత ఈజీ కాదనేది ఇరువర్గాలు చెప్తున్న మాట. మరి చూడాలి ఏం జరుగుతుందో..!













