చీరాల నుంచే బరిలోకి ఆమంచి..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో 151 సీట్లు దక్కించుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు ఏకంగా 175 సీట్లనూ గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. అంటే విపక్షాలెవరూ గెలవకూడదనేది ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం. అందుకు తగ్గట్టుగానే అభ్యర్థుల ఎంపిక ఓ వైపు, ప్రచారం మరోవైపు సాగిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ సమన్వయ కర్తల పేరుతో పలువురిని ప్రకటించింది. వీళ్లే అభ్యర్థులుగా దాదాపు ఖరారు.
ఇప్పటివరకూ ఏడు జాబితాలను విడుదల చేసింది వైసీపీ. నియోజకవర్గ సమన్వయ కర్తల పేరుతో విడుదలైన ఈ జాబితాలో ముప్పై మందికి పైగా సిట్టింగులకు సీట్లు దక్కలేదు. మరో నలభై మందికి స్థానభ్రంశం కలిగింది. దీంతో దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులు మారబోతున్నారు. అయితే ఈ జాబితాల్లో ఎప్పటికప్పుడు మళ్లీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇది ఒకింత గందరగోళానికి దారి తీస్తోంది. మొదట్లో ఒక నియోజకవర్గానికి సమన్వయకర్తగా ప్రకటించి.. ఆ తర్వాత మరో జాబితాలో వాళ్లను తొలగించి మరొకరికి కట్టబెడుతున్నారు. దీంతో కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు.
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గానికి ఆమంచి కృష్ణమోహన్ ను సమన్వయకర్తగా నియమించారు జగన్. చాలాకాలంగా పర్చూరు కేంద్రంగా ఆయన పని చేస్తున్నారు. మనసంతా చీరాలపైనే ఉన్నా పార్టీ ఆదేశానుసారం ఆయన పర్చూరుకు ఇష్టం లేకపోయినా వెళ్లారు. అయితే తాజాగా ఆమంచిని తప్పించి ఎడం బాలాజికి సమన్వయకర్తల బాధ్యతలు అప్పగించింది పార్టీ. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరారు ఎడం బాలాజీ. తర్వాత ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో విదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన్ను తీసుకొచ్చి పర్చూరు బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం.
వైసీపీ అధిష్టానం నిర్ణయం ఆమంచి కృష్ణమోహన్ ను షాక్ కు గురి చేసింది. చీరాలను వదిలి పర్చూరుకు వెళ్లమని చెప్పి.. ఇప్పుడు ఆ సీటు కూడా ఇవ్వకుండా మొండిచేయి చూపడంపై ఆమంచి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. దీంతో చీరాలలోనే తాడోపేడో తేల్చుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమంచి, టీడీపీ తరపున కరణం బలరాం చీరాలలో పోటీ పడ్డారు. కరణం బలరాం గెలిచి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆమంచికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు పార్టీ సీటు దక్కదని తేలడంతో ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగి సత్తా చాటాలనుకుంటున్నారు ఆమంచి. గతంలో కూడా ఒకసారి ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. మరి ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాలి.













