టీడీపీ.. బీజేపీ పొత్తు పై అంబటి సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. ఎన్నో మంతనాల తరువాత ఫైనల్ గా కమలం సైకిల్ కు మద్దతు ఇవ్వడానికి ఫిక్స్ అయింది. అయితే ఈ పొత్తు కోసం ఎంతో కృషి చేసిన పవన్ కళ్యాణ్ మాత్రం మరొకసారి త్యాగమూర్తిగా మిగిలిపోయాడు. అధికార వైకాపా పార్టీ ఈ విషయంపై ఘాటుగానే స్పందిస్తుంది. ఈ ముగ్గురు మధ్య కుదిరిన పొత్తు అనైతికమైనది అంటూ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అమిత్ షా పై ఆరోపణల రాళ్లు రువ్విన చరిత్ర ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు అన్ని మర్చిపోయి గెలవను అనే భయంతో పొత్తుకు సిద్ధమయ్యాడని ఆయన వ్యాఖ్యానించారు. పాచిపోయిన లడ్డూ ఇచ్చారు అంటూ పవన్ కేంద్రానికి విమర్శించిన విషయం కూడా అంబటి గుర్తు చేశారు. అలాంటి ఈ ఇద్దరు జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేక ఇప్పుడు కేంద్రంతో పొత్తుకు సిద్ధపడ్డారని ఆయన అన్నారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నించినా జనం కోరుకునేది జగనేనని తమ గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేశారు.













