ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆమె కారులో వెళ్తుండగా.. వాహనం టైరు పేలింది. దీంతో ఆమె ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారు గాల్లో పల్టీ కొట్టింది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన నీరజా రెడ్డి వెళ్తున్న వాహనం టైరు పేలి, పల్టీ కొట్టి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఫార్చూనర్ కారు నుజ్జునుజ్జయింది. ఈ నేపథ్యంలో నీరజా రెడ్డి తలతోపాటు శరీరం అంతా తీవ్రమైన గాయాలైనట్లు తెలుస్తోంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స తీసుకుంటుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు.













