పవన్ ప్రమాణస్వీకారానికి అల్లు ఫ్యామిలీ దూరం..!
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఇవాళ కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పవన్ కల్యాణ్ సహా 24 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అతిరథమహారథులెంతో మంది హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డాతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు సినీ ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం దూరంగా ఉండిపోయింది.
పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటి చేసి ఓడిపోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు పవన్ కల్యాణ్. కానీ ఈసారి తనతో పాటు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చాటారు. దీంతో పవన్ కల్యాణ్ దేశంలోనే హాట్ టాపిక్ గా మారారు. ప్రధాని మోదీ కూడా పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా పొగిడారు. ఇవాల్టి ప్రమాణ స్వీకారంలో కూడా పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మెగా బ్రదర్స్ ను పక్కన పెట్టుకుని మోదీ చేసిన అభివాదం వైరల్ గా మారింది. మరోవైపు గ్యాలరీలో రామ్ చరణ్ సహా మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది.
మెగా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా.. ఆ ఇంట్లో ఎలాంటి కార్యక్రమం ఉన్నా అల్లు ఫ్యామిలీ కూడా అక్కడ ఉండాల్సిందే. వాళ్ల కుటుంబాల మధ్య బంధం అలాంటిది. అయితే ఇటీవల ఆ రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చిందని సమాచారం. అందుకే ప్రధాన కార్యక్రమాల్లో కూడా అల్లు ఫ్యామిలీ కనిపించట్లేదు. మొన్న మెగాస్టార్ ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లినప్పుడు కూడా అల్లు ఫ్యామిలీ అక్కడ కనిపించలేదు. ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో కూడా అల్లు అరవింద్ కానీ, అల్లు అర్జున్ కానీ కనిపించలేదు. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ నిజమేనని అర్థమవుతోంది.
జనసేనాని వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరపున ప్రచారానికి వెళ్లారు. ఇది అప్పట్లో సంచలనం కలిగించింది. నాగబాబు పరోక్షంగా చేసిన ట్వీట్ వైరల్ అయింది. దానిపై పెద్ద దుమారమే రేగింది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ అంటీముట్టనట్టే ఉంటోంది. అది అలాగే కంటిన్యూ అవుతోంది. సాయిధరమ్ తేజ్ తాజాగా అల్లు అర్జున్ తో పాటు అల్లు స్నేహా రెడ్డిని అన్ ఫాలో చేశారు. మెగా ప్యాన్స్ కూడా అల్లు అర్జున్ సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే ఈ ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పట్లో సెటిల్ అయ్యేటట్లు కనిపించట్లేదు. అందుకే పవన్ ప్రమాణానికి కూడా అల్లు ఫ్యామిలీ దూరంగా ఉండిపోయింది.













