అల్లు అర్జున్ పార్టీ కోసం కాదు.. కేవలం స్నేహితుడి కోసం వెళ్లాడు..చంద్రశేఖర్ రెడ్డి..
ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఇక రేపు పోలింగ్ తో ఆంధ్రాలో ఎన్నికల హడావిడి చాలా వరకు ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో నిన్న నంద్యాలకు తన స్నేహితుడికి సపోర్ట్ ఇవ్వడానికి అల్లు అర్జున్ వెళ్లడం పై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఒకపక్క పవన్ కళ్యాణ్ వైసీపీ కు వ్యతిరేకంగా టీడీపీ తో చేతులు కలిపి పోరాడుతుంటే.. మెగా కాంపౌండ్ హీరో అయినా అల్లు అర్జున్ వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొనడంపై మెగా అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి.. శిల్పా రవి, అల్లు అర్జున్ కు ఎప్పటినుంచో స్నేహితుడని.. అతను పార్టీ కోసం కాక కేవలం స్నేహం కోసం మాత్రమే నంద్యాల వెళ్ళాడని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించలేదని.. కేవలం తన స్నేహితుడు గెలవాలి అని ప్రచారం చేస్తున్నాడని తెలిపారు. నచ్చిన వారికి ప్రచారం చేయడం వ్యక్తిగతమని.. ఇందులో పార్టీలను తీసుకురావడం మంచిది కాదని స్పష్టం చేశారు. దీనితో పాటుగా ఈసారి దేశ ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉందని చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నే నమ్ముకొని ఉన్నానని.. ఈసారి దేశ ప్రజలు తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఆరోపించిన చంద్రశేఖర్.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.













