Alla Nani: టీడీపీలో ఆళ్ల నాని చేరికకు లైన్ క్లియర్..! రేపే ముహూర్తం..!!
ఆంధ్రప్రదేశ్ లో నేతల కప్పదాట్లు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఓడిపోయిన తర్వాత పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అలా వైసీపీని వీడిన వాళ్లలో ఏలూరుకు (Eluru) చెందిన మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని (Alla Nani) కూడా ఉన్నారు. రెండు నెలల కిందటే ఆయన వైసీపీ (YCP) ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ఇన్ ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడాయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నారు.
కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఆళ్ల నాని. కాంగ్రెస్ (Congress) నుంచి వైసీపీలో చేరిన అనంతరం ఆ పార్టీలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఏలూరు నుంచి నాలుగుసార్లు ఆయన పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో గెలవడంతో ఆయనకు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పోస్టు కూడా ఇచ్చారు జగన్. ఆ సమయంలో టీడీపీని అణచివేయడంలో ఆళ్ల నాని గట్టిగా ప్రయత్నించారు. ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలపై కేసులు పెట్టించారనే ఫిర్యాదులు ఉన్నాయి. అయినా ఆళ్ల నానిని ఎదుర్కొని నిలబడింది టీడీపీ (TDP) కేడర్. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి (Badeti Chanti).. ఆళ్ల నానిని ఓడించి సత్తా చాటారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. నాలుగు నెలలకే వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు తెరవెనుక తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి రెండు వారాల కిందటే ఆళ్ల నాని అమరావతిలో చంద్రబాబు (CM Chandrababu) సమక్షంలో కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆళ్ల నాని చేరికను ఏలూరు టీడీపీ కేడర్ అంతా తీవ్రంగా వ్యతిరేకించింది. అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టింది. దీంతో టీడీపీ హైకమాండ్ కాస్త వెనక్కు తగ్గింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించామని.. ఈ మేరకు కేడర్ ను సెట్ చేయాలని ఎమ్మెల్యే బడేటి చంటికి అప్పగించారు చంద్రబాబు.
కేడర్ తో సంప్రదింపుల అనంతరం ఆళ్ల నాని చేరికను ఖరారు చేశారు బడేటి చంటి. బుధవారం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని చేరబోతున్నట్టు ప్రకటించారు. ఆళ్ల నాని వల్ల ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటామని హైకమాండ్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు పెరుగుతాయని.. వైసీపీని ఖాళీ చేసి పార్టీ బలపడాలంటే ఆళ్ల నాని లాంటి నేతలు పార్టీకి అవసరమని టీడీపీ అధిష్టానం కేడర్ కు వివరించినట్లు సమాచారం. అందుకే అయిష్టంగానే ఆళ్ల నాని చేరికకు తెలుగు తమ్ముళ్లు ఓకే చెప్పారు. మొత్తానికి రెండు నెలల తర్జనభర్జనల అనంతరం ఆళ్ల నాని సైకిల్ ఎక్కబోతున్నారు.













